మత్స్య రంగ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల తో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ లు, మత్స్య శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుల వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా వృద్దిలోకి రావాలి అనే దృడ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆలోచనతో మత్స్యకార వృత్తిలో జీవనం సాగిస్తున్న కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నదని వివరించారు.పథకాల పై విస్తృత ప్రచారం చేయాలని కల్లెక్టర్లు, మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 7 వ తేదీన అన్ని జిల్లాల లో మత్స్య కారులతో వర్క్ షాప్ లను నిర్వహించాలని ఆదేశించారు. చేపల పెంపకానికి అనువైన చిన్న, మద్య తరహా, భారీ నీటి వనరులలో పూర్తి స్థాయిలో చేపలను పెంచడం, చేప పిల్లల ఉత్పత్తిలో స్వయం సంవృద్ది సాదించడం, వినియోగదారులకు పరిశుభ్రంగా చేపలను అందించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మత్స్య విత్తన అభివృద్ధి పథకం క్రింద రూ.204 కోట్లతో హేచరీలు, నూతన మత్స్య విత్తన క్షేత్రాల నిర్మాణం, విత్తన క్షేత్రాల బలోపేతం లాంటివి చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. చేపల వేట కోసం మత్స్య కారులకు రూ.82 కోట్లతో సబ్సిడీ పై క్రాఫ్ట్ లు, వలలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.370 కోట్లతో చేపల మార్కెటింగ్ కు అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు.