భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్ జగన్ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ,వైఎస్ జగన్ ని విమర్శించడంపై రామయ్య మండిపడ్డారు.
‘వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి, గోడ దూకిన నువ్వు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని నువ్వ ఎమ్మెల్యేగా ఎలా అర్హుడివో చెప్పాలి. పార్టీ మారి ప్రజాస్వామ్యంలో జీవచ్చవాలుగా మారిన మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్ జగన్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నది కళ్లకు కనిపించడం లేదా?. చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన అవినీతి సొమ్ముతో మీరు ఎంత అభివృద్ధి చెందారో అందరికీ తెలుసు. అతి త్వరలో మీ అవినీతిపై మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. హోదాపై మీ ముఖ్యమంత్రికే మొహం చెల్లడం లేదు. మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. దమ్ము, సిగ్గు, శరం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.’ అని డిమాండ్ చేశారు.