ల్యాండింగ్ అవుతున్న విమానం టైర్ పేలి నిప్పురవ్వలు చెలరేగిన ఘటన బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇండిగో ఫ్లైట్.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది… ఇంతలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే రోజాతోపాటు 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం సమయంలో విమానాన్ని సుమారు గంటపాటు రన్‌వేపైనే ఉంచారు. గేట్లు కూడా తెరవలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
