ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి ఏప్రిల్ 25 మధ్యలో ఈస్టర్ వస్తుంది.
ఈస్టర్ లూనిసోలార్ కేలండర్ ను అనుసరించి జరుపుకుంటారు. లూనిసోలార్ కేలండర్ అంటే చంద్రుని స్థితిని, సౌరసంవత్సర సమయాన్ని రెండింటినీ తెలియచేస్తుంది. జూలియన్ మరియు గ్రెగోరియన్ కేలండర్స్ రెండూ సౌరమానం ప్రకారమే పనిచేస్తాయి. ఎందుకంటే అవి భూపరిభ్రమణాన్ని బట్టి భూమి యొక్క స్థితిని తెలియచేస్తాయే కానీ చంద్రుడి స్థితిని కాదు. అయినప్పటికీ ఈస్టర్ తేదిని మాత్రం లూనిసోలార్ కేలండర్ ను అనుసరించే ఖరారు చేస్తాయి. గ్రెగోరియన్ ఈస్టర్ 35 తేదీలలో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏప్రిల్ 19 న ఈస్టర్ ఎక్కువసార్లు అంటే 2,20,400 సార్లు వస్తుంది. మిగిలిన అన్ని తేదీలు కలిపి సరాసరిన 1,89,525 సార్లు వస్తాయి. ఈస్టర్ చ్రక్రం ప్రతి 57 లక్షలకొకసారి పునరావృతమవుతుంది.
ఈస్టర్ మార్చ్22 న క్రీ.శ. 1818 వసంవత్సరంలో వచ్చింది. మళ్లీ క్రీ.శ. 2285 వసంవత్సరంలో వస్తుంది. అలాగే ఏప్రిల్ 25 న క్రీ.శ. 1943 వసంవత్సరంలో వచ్చింది. మళ్లీ క్రీ.శ. 2038 వసంవత్సరంలో వస్తుంది.కొన్నిసార్లు తూర్పు దేశాల క్రైస్తవులు మరియు పశ్చిమ దేశాల క్రైస్తవులు ఒకే తేదిన ఈస్టర్ జరుపుకోవటం జరుగుతుంది. 2011 ఈస్టర్ (ఈరోజు) అటువంటివాటిలో ఒకటి. 1984 ఏప్రిల్ 22, 1987 ఏప్రిల్ 19, 1990 ఏప్రిల్ 15, 2001 ఏప్రిల్ 15, 2004 ఏప్రిల్ 11, 2007 ఏప్రిల్ 8, 2010 ఏప్రిల్ 4, 2014 ఏప్రిల్ 20, 2017 ఏప్రిల్ 16 2018 ఏప్రిల్ 1 మరికొన్నిఅటువంటి రోజులు.
*ప్రతి సంవత్సరం తొంభై మిలియన్ల చాకొలేట్ ఈస్టర్ బన్నీస్ తయారవుతాయి.
* ఈస్టర్ కోసం 16 బిలియన్ల జెల్లీ బీన్స్ తయారవుతాయి. పిల్లలు ఎరుపు జెల్లీ బీన్స్ ను ఇష్టపడతారు.
* చాకోలేట్ తో చేసిన ఈస్టర్ ఎగ్స్, జెల్లీ బీన్స్ వంటివి తింటారు.
* విదేశాలలో ఈస్టర్ రోజు గ్రుడ్లను దొర్లించే ఆట చాలా ప్రసిధ్దమైనది.