క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను గుడ్‌ఫ్రైడే గడిచిన రెండు రోజులు తరువాత జరుపుకుంటారు.
ఈస్టర్ రుతువు 40రోజులు
క్రీస్తు మరణం, పునరుత్థానం కాలం క్రీ.శ 26 మరియు క్రీ.శ 36 మధ్య జరిగినట్లు వివిధ వాఖ్యానాలు ఉన్నాయి. ఈస్టర్ ఇంకా ఈస్టర్ టైడ్ లేదా ఈస్టర్ రుతువు అని పిలువబడే చర్చి సంవత్సరం యొక్క రుతువును కూడా సూచిస్తుంది. ఈ సంప్రదాయ ప్రకారం ఈస్టర్ రుతువు ఈస్టర్ దినం నుంచి ప్రారంభమై ఆరోహణ దినంగా పిలువబడే రోజు వరకు 40రోజుల వరకు ఉంటుంది. కానీ ఇపుడు అధికారికంగా పెన్తెకొస్తు వరకు 50రోజులు కొనసాగుతుంది. ఈస్టర్ తేదీ మార్చ్ 22 నుండి ఏప్రిల్ 25 మధ్య మారుతూ ఉంటుంది.