గుడ్ ఫ్రైడే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజును గుర్తు చేసుకునే రోజు. క్రైస్తవులకు పవిత్రమైన రోజు. అయితే, ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు కాబట్టి గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇదే రోజు క్రైస్తవులందరూ ప్రార్ధనా మందిరాలకు వెళ్లి.. యేసు క్రీస్తు యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడమే కాకుండా, మరికొందరు కల్వరి సందర్శనార్ధం పయనమవుతుంటారు.
ఇదిలా ఉండగా, ప్రతీ ఏడాది నిర్వహించే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మానవత్వాన్ని చాటుతారు. మనుషులంతా ఒక్కటేనన్న యేసుక్రీస్తు సిద్ధాంతాన్ని ఆచరించి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఇంతకీ ప్రతీ ఏడాది గుడ్ ఫ్రైడే నాడు పోప్ ఫ్రాన్సిస్ ఏం చేస్తారంటే..!! పోప్ ఫ్రాన్సిస్ గుడ్ ఫ్రైడే రోజున కరుడుగట్టిన ఖైదీల కాళ్లను నీళ్లతో కడిగి, ఆ తరువాత మంచి వస్ర్తంతో ఖైదీల తడి కాళ్లను తుడుస్తారు. అనంతరం ఖైదీల కాళ్లను పోప్ ఫ్రాన్సిస్ ముద్దాడుతారు. ఇలా ప్రతీ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ కరుడుగట్టిన ఖైదీల కాళ్లను ముద్దాడుతారు.
పోప్ ఫ్రాన్సిస్ ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. యేసుక్రీస్తు కూడా తనకు మరణం సంభవిస్తుందని తెలిసిన ముందు రోజు రాత్రి 12 మంది శిష్యుల కాళ్లు కడిగినట్లు బైబిల్ చెబుతోంది. అయితే, పాప్ ఫ్రాన్సిస్ యేసుక్రీస్తు చేసిన ఆ పనులను గుర్తు చేసుకుంటూ నిరాడంబరతను చాటుతుంటారు. గత ఏడాది పాప్ ఫ్రాన్సిస్ ఖైదీల కాళ్లు కడుగగా, వారిలో ఒకరు హిందువు కాగా, 11 మంది వివిధ మతాలకు చెందిన వారు కావడం విశేషం. నైజీరియన్ క్యాథలిక్కులు, ముగ్గురు ఎరిత్రయ మహిళలు, మాలి, పాక్, సిరియాకు చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు. దీనిని సోదర స్పర్శగా చెబుతారు పోప్ ఫ్రాన్సిస్.