ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,నేతలు ఏపీ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లోకి పార్టీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నారు . టీడీపీ ప్రభుత్వం చేసే పాలన నచ్చక సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన జగన్ గూటిలో చేరడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటుగా ఆయన అనుచరులు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు . దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కు వీరాభిమాని అయిన ఆయన రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు .తదనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు .
ప్రస్తుతం ఏపీ ప్రజల సమస్యలపై ముఖ్యంగా ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ చేస్తోన్న పోరాటానికి ఆకర్షితుడై వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన వారసుడిగా చేగొండి సూర్యప్రకాశ్ రాజకీయ భవితవ్యం కోసమే ఆయన మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం అవుతారని చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం హరిరామజోగయ్య ఆరోగ్యం అంత సహకరించడం లేదు. అయినప్పటికీ ఆయనకు కొంత ఆదరణ ఉంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో ఆయనకు ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రంగా హత్యకు సంబంధించి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆ తర్వాత కాపు ఉద్యమంలో ముద్రగడకి జోగయ్య మద్ధతు పలికారు. వచ్చే ఎన్నికల్లో హరిరామజోగయ్య వారసుడు పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. చేగొండి సూర్యప్రకాశ్ వ్యాపారరంగంలో ప్రయత్నించినప్పటికీ రాజకీయాల మీద ఆసక్తితోనే ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో సూర్యప్రకాశ్ కి టికెట్ కోసం హరిరామజోగయ్య చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన తర్వాత పార్టీ కండువా కప్పుకునే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.