నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలు చూసుకోరు. అందుకే ఇష్టపడి పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించే యువతీ ,యువకులకు సుప్రీంకోర్టు మంచి శుభవార్త చెప్పింది. కుల పంచాయతీలకు ఇటువంటి పెళ్ళిళ్ళను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. యువతీయువకులు పరస్పర సమ్మతితో చేసుకునే వివాహాన్ని అడ్డుకునేందుకు సమావేశమవడం కూడా చట్టవిరుద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ మార్గదర్శకాలు ఈ విషయంలో తగిన చట్టం ఆమోదం పొందే వరకు అమల్లో ఉంటాయని వివరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ డీ వై చంద్రచూడ్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. శక్తి వాహిని అనే ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. కుల పంచాయతీలు, పరువు హత్యల నుంచి యువతీయువకులను కాపాడాలని పిటిషనర్ కోరారు.
