ప్రేమకు వయసు లేదు అంటే ఇదేనేమో.. ఓ 20 ఏళ్ల డిగ్రీ అమ్మాయి, 16 ఏళ్ల బాలుని మధ్య ఫేస్‌బుక్ ద్వారా ప్రేమ పుట్టి, అది పెళ్లితో ముగిసింది. కొద్దిరోజులు కాపురం చేశాక అసలు కథ మొదలైంది. వివరాలను చూస్తే.. ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఒక మైనర్ బాలుడు, తనకన్నా నాలుగేళ్లు పెద్దదయిన దివ్యాంగురాలయిన యువతి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు కలసి పట్టుమని 15 రోజులు కలసి సంసారం చేయగానే ఆ అబ్బాయి ఆమెను వదిలేసి పరారయ్యాడు. ఈ సంఘటన దొడ్డ తాలూకాలోని కొనఘట్ట గ్రామంలో చోటుచేసుకుంది. పోలియో బాధితురాలైన ఒక యువతి (20)ది తాలూకాలోని కొనఘట్ట గ్రామం. దొడ్డ పట్టణంలోని ఒక కాలేజీలో బీఏ చదువుతోంది. ఈమెకు 5 నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా బెంగళూరు ఉత్తర తాలూకా బేగూరుకు చెందిన 16 ఏళ్ల బాలునితో పరిచయం కుదిరింది. నెమ్మదిగా ఫోన్లలో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడూ కలిసేవారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఇద్దరూ బాగేపల్లిలోని ఒక దేవాలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. 15 రోజులు అక్కడే స్నేహితుడి ఇంట్లో గడిపారు. ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూతురికోసం తెలిసిన చోటల్లా వెదికి చివరకు బాగేపల్లిలో ఉన్నారని కనుక్కుని ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చారు. అయితే మైనర్ బాలుడు ఇంటికి వెళ్లి వివాహం రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన పత్రాలు, తల్లిదండ్రులను ఒప్పించి తీసుకువస్తానని చెప్పి వెళ్లినవాడు తిరిగి రాలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, బాలున్ని వెతికి పట్టుకొచ్చారు. ఈలోపే బాలుడు పూర్తిగా మారిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియదని బుకాయించాడు. నిందితుడు మైనర్ కావడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మాయేమో తన భర్త తనకు కావాలని పట్టుబట్టింది. దీంతో ప్రజా విమోచనా చళువళి నాయకులు యువతికి న్యాయం చేయాలంటూ డీవైఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.