విద్యాబుద్ధులు నేర్పి… విద్యార్థుల్ని సమాజంలో ఉన్నతంగా నిలపాల్సిన పంతుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిని వేధించాడో లెక్చరర్. పరీక్షల్లో ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ఓ 17 ఏళ్ల విద్యార్థినిని 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని ఘట్కోపాల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బాధిత విద్యార్థిని జూనియర్ కాలేజీలో కామర్స్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు విద్యార్థిని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
తమ కుమార్తె కొన్ని రోజులుగా ముభావంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ ఆమెను ప్రశ్నించారు. దాంతో జరిగిన విషయాన్ని ఆమె పూసగుచ్చినట్లు వారికి వివరించింది. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసులో నిందిత ప్రొఫెసర్‌పై సత్వర చర్యను తీసుకునే విధంగా మద్దతు కోసం వారు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఫలితంగా నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.