ప్రస్తుతం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి చేరడం మాములు విషయమైంది. ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులు చూపించిన తాయిలాలకు ఆశపడి .ఇచ్చే నోట్ల కట్టలకు ..ప్రాజెక్టులకు లొంగి తమను గెలిపించిన ప్రజలను ..అవకాశమిచ్చిన పార్టీలను మోసం చేస్తూ వేరే పార్టీలో చేరుతున్నారు .అందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినట్లు ఈ ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించారు. ఆపైన శనివారం వీరు తమ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది.
జహీర్ అహ్మద్ ఖాన్, అఖండ శ్రీనివాస్ మూర్తి, చలువరాయ స్వామి, ఇక్బాల్ అన్సారీ, బాలకృష్ణ, రమేశ్ బండి సిద్దె గౌడ, భీమా నాయక్‌లు పార్టీకి రాజీనామా చేసినట్టు జేడీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌బాబు తెలిపారు. 2016 రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీరంతా పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశారు. దీంతో ఈ ఏడుగురిని జేడీఎస్ గతంలోనే సస్పెండ్ చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీరంతా కాంగ్రెస్ మూడో అభ్యర్థి అయిన జీసీ చంద్రశేఖర్‌కు ఓటేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో నలుగురు తమ సొంత నిర్ణయానుసారమే రాజీనామా చేసినట్టు పేర్కొనడంతో వారి రాజీనామాలు ఆమోదించినట్టు స్పీకర్ కేబీ కోలివడ్ తెలిపారు. ఆదివారం తామంతా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు నాగమంగళ ఎమ్మెల్యే చలువరాయ స్వామి తెలిపారు