హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మున్సిపాలిటీల మీద ఉన్న భారాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకు స్వచ్ఛ టిప్పర్లను ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. హైదరాబాద్, వరంగల్‌లో వ్యర్థ పదార్థాల ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
నగరంలో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. తద్వారా పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. 4 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ద్వారా నెలకు రూ. 35 కోట్లు ఆదా అవుతుందన్నారు. హైదరాబాద్ ప్రజల కోసం 826 ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఒక లక్ష ఇండ్లు నిర్మిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఖాళీ కుండల ప్రదర్శన జరిగేది. నీటి సరఫరా, విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగుపడింది. హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. చార్మినార్ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. మురికివాడల్లో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తామన్నారు. హైదరాబాద్ పట్టణంలో రూ. 288 కోట్లతో 20 సరస్సులను సుందరంగా తీర్చిదిద్ది, వాకింగ్ ట్రాక్స్‌ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.