తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మరియు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సోమవారం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది.
క్యాడర్ ప్రాసిక్యుటర్ పోస్టుల మంజురూ, భర్తీ కి కొంత సమయం అవసరం అయిన నేపధ్యంలో ప్రస్తుతం నియామకం చేస్తున్న టెన్యూర్ ప్రాసిక్యూటర్ల నియామకం కోసం మరింత పటిష్టమైన విదానాన్ని అవలంభించాలని నిర్ణయించారు. అంతే కాకుండా, డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ ఆఫీసులో అవసరమైన మినిస్టేరియల్ సిబ్బంది, ఫర్నిచర్, కంపూటర్లు, సిబ్బందికి ఇంటర్నెట్, ఫోన్ ఇతర సదుపాయాలు కల్పనకు పూర్తి స్థాయిలో తక్షణమే తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ కు సూచించారు.
ఇప్పటికే వివిధ కోర్టులకు ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టుల మంజూరు కొరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపాదనల తో పాటు, ఈ ప్రతిపాదనలు జత చేసి సత్వరమే మంజురుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖాధిపతి కార్యాలయానికి తగిన వసతి లేని కారణంగా అనువైన ప్రభుత్వ భవనాన్ని సమకూర్చుకోవాలని, ఈ విషయంలో భవనాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ కు సూచించడం జరిగింది. ఈ శాఖను పటిష్టపరచడానికి అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేసి, వీటి భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, లా సెక్రటరీ నిరంజన్ రావు, డిజిపి మహేందర్ రెడ్డి, సి.ఐ.డి. అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్, డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు. .