సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతుందని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. నిరుపేద ఆడపిల్లలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ. 75,116/- నుంచి రూ.1,00,116/- కు పెంచుతూ ఈ మేరకు నిర్ణయాన్ని ఈ రోజు శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పేద గిరిజన ఆడబిడ్డలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి ఆర్థిక సాయం లక్షా నూటపదహార్లకు పెంచడం పట్ల మంత్రి చందూలాల్ హర్షం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పాటుపడుతోందని ఆయన అన్నారు. కల్యాణలక్ష్మి పథకం ఇప్పటికే గిరిజన ఆడపిల్లల పెండ్లికి ఉపయుక్తంగా మారిందని, ఇప్పుడు సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్థిక సాయాన్ని లక్ష రూపాయలకు పెంచిన సందర్భంగా ఈ పథకాన్ని ఎటువంటి అవకతవకలకు, అవినీతికి తావు లేకుండా మరింతగా ఉపయోగించుకోవాలని మంత్రి చందూలాల్ గిరిజనులకు సూచించారు. కల్యాణలక్ష్మి పథకానికి ఆర్థిక సాయం పెంచడం ద్వారా సీఎం కేసీఆర్ సంక్షేమ సారథిగా, దేశంలోనే సాటిలేని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని మంత్రి చందూలాల్ ప్రశంసించారు.