పేదలు, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార వాల్ పోస్టర్ను ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్లతో కలిసి మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ర్టం .. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మీ నిరుపేదలకు వరమని, ఇక నుంచి నిరుపేద ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మీ కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ. ఒక లక్షా 116 అందించనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘం నాయకులు బెల్లం మాధవి, పల్లవి, సింగీతం సాయి, అనూప్, గంగిరెద్దుల సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జెల్లెల నర్సింహా, తదితరులు పాల్గొన్నారు