ఉగాది పండుగ వచ్చేసింది.ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అక్షర కానుకను అందిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర, పండుగలు, పాటలు ఈ తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో.. ప్రజలందరికీ ‘సాంస్కృతిక’ కరదీపికను ఉచితంగా అందజేస్తున్నారు.
మామిడాకుల తోరణాలు కట్టిన తెలుగు లోగిలిలో కేసీఆర్ ఫొటోతో కూడిన కవర్‌పేజ్.. పండుగ శోభను కళ్ల ముందుంచింది. ‘తీయనైన తెలుగు.. తెలంగాణ వెలుగు’ అన్న శీర్షికతో ఈ నేల సాంస్కృతిక వైభవాన్ని చాటుతోంది. ఉగాది వేళ..ఈ చిన్న పుస్తకం ‘సంక్షిప్త సాంస్కృతిక కరదీపిక’గా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సందేశాన్నిచ్చారు.
తెలుగు సంవత్సరాలు, తిథులు, వారాలు, పక్షాలు-ఆయనాలు, మాసాలు-రుతువులు, కార్తెలు, నక్షత్రాలు, రాశులతోబాటు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, యుగాలు, ప్రాచీన కాల గణనం, ప్రాచీన సంఖ్యామానానికి సంబంధించిన సమాచారాన్ని కరదీపికలో పొందుపరిచారు.