ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్నారం, సుండిళ్ళ ,మేడిగడ్డ బ్యారేజీలలో 5 కోట్ల 81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా మూడు బ్యారేజీలు,మూడు పంప్ హౌజ్ ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.
శనివారం మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.బ్యారేజీలు, పంఫౌజ్ ల పనులను ఆయన తనిఖీ చేశారు.అన్నారం బ్యారేజీ గేట్ల బిగింపు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మంత్రి ఈ పనులను పరిశీలించారు. అన్నారం బ్యారేజీకి 66 , మేదిగడ్డ కు 86, సుందిళ్ళ బ్యారేజీకి 74 గెట్లను అమర్చవలసి ఉంది.అన్నారం బ్యారేజికి శనివారం తొలి గేటు బిగించారు.కాళేశ్వరం కు సంబంధించిన బ్యారేజీలు, పంప్ హౌజ్ పనుల్లో 80 శాతం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తయినట్టు మంత్రి ప్రకటించారు.
మిగతా 20 శాతం పనులు మరో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.అన్నారం-కన్నేపల్లి మధ్య గ్రావిటీ కెనాల్ పనులు 70 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు మీడియా ప్రతినిధులకు చెప్పారు. కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి హరీశ్ రావు కన్నెపల్లి దగ్గర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అమేయ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.