ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సమరశంఖం పూరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలతో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ వెల్లడించారు.
‘కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామ’ని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు ఆయన స్వయంగా లేఖలు కూడా రాశారు.ఇందులో బాగంగానే వైసీపీ లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సౌగతా రాయ్, బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్, టీడీపీ నేత తోట నరసింహం, టీఆర్ఎస్ లోక్‌సభ నేత జితేందర్ రెడ్డి, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆప్ ఎంపీ భగవంత్ మన్ ను కలిసిన వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తితో వైఎస్ జగన్ రాసిన లేఖలను అందజేశారు.