Home / SLIDER / కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!

కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!

తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని మానవతా కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది . రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం, ఎక్కువ శాతం మంది రైతుల మేలును కాంక్షించి ఆయన ఈ బడ్జెట్ కు ప్రాణం పోసినట్లుగా అర్ధమవుతుంది . కీలకమైన ఏ ఒక్క రంగాన్నీ వదిలిపెట్టకుండా భారీగా కేటాయింపులు జరపడం మామూలు విషయం కాదు . మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల సంక్షేమం , వ్యవసాయం , అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకుని అంత్యంత జాగ్రత్తగా బడ్జెట్ ను రూపొందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి . పేదల సంక్షేమానికే దాదాపుగా 45 వేల కోట్లు కేటాయించడం ఆయనకు ప్రజల పట్ల ఉన్న అత్యంత సానుకూల దృక్పథానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు . మొత్తం తెలంగాణ రైతులకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ లో 45763 కోట్లు కేటాయించడం భారతదేశ బడ్జెట్ లోనే పెద్ద సంచలనం . అందులో సాగు నీటి ప్రాజెక్టులకు 25000 కోట్లు , రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున పంటల పెట్టుబడి మద్ధతు కింద రైతు లక్ష్మి పేరుతో రూ.12000 కోట్లు కేటాయించడం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదు. రైతుల వ్యవసాయ ఉచిత విద్యుత్ కు రూ.4983 కోట్లు ,ప్రభుత్వమే విద్యుత్ శాఖ కు చెల్లిస్తున్నది. దేశంలో తొలి సరిగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ . 5 లక్షల భీమా కల్పించడానికి రూ . 500 కోట్లు కేటాయించడం అసాధారణ నిర్ణయంగా పేర్కొనవచ్చు . అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు రూ . 522 కోట్లు కేటాయించారు . ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఓసీ వర్గాల పెన్షన్లు , రేషన్ బియ్యం , కళ్యాణ లక్ష్మి , ఆరోగ్యశ్రీ , గురుకుల విద్యాలయాలు , ఫీజు రీయంబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ , కేసీఆర్ కిట్స్ , హాస్టళ్లలో వసతులు సహా ఏ ఒక్క రంగాన్ని , వర్గాన్ని మినహాయించకుండా కేటాయింపులు జరిపారు .

అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ : సీఎం కేసీఆర్
———————————————————–
తెలంగాణ రాష్ర్టానికి ఉన్న ఆదాయ వనరులను, రాష్ర్టానికి ఉన్న అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం కుదురుస్తూ బడ్జెట్ రూపొందించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉందన్నారు. పూర్తి సమతుల్యంతో బడ్జెట్ ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఎక్కువ శాతం ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర బడ్జెట్ రూ. 1,74,453.84 కోట్లు
————————————————-
రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో మంత్రి ఈటల చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం పాఠం మొత్తం ఒక గంట 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆర్థిక మంత్రి ఈటల.. ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే.

ఈ బడ్జెట్లో సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేశారు. గురుకులాలకు అత్యధికంగా నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించి.. అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని ఈటల స్పష్టం చేశారు. గర్భిణీల సంక్షేమంతో పాటు మహిళా శిశు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు.

-మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453.84 కోట్లు
-రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
-రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు
-కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు
-ద్రవ్య లోటు అంచనా రూ. 29,077 కోట్లు

-2018-19 నాటికి మొత్తం అప్పులు రూ. 1,80,238 కోట్లు
-ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,51,133 కోట్లు
-ప్రగతి పద్దు రూ. 1,04,757 కోట్లు
-జీఎస్డీపీలో మొత్తం అప్పులు 21.39 శాతం

-2017-18 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు
-మొత్తం ఖర్చు రూ. 1,42,506 కోట్లు
-రెవెన్యూ వ్యయం రూ. 1,06,603 కోట్లు
-మూలధన వ్యయం రూ. 25,447 కోట్లు
-జీఎస్టీ వల్ల ఆదాయ పెరుగుదల గత ఆర్థిక సంవత్సరం కంటే స్వల్పంగా తగ్గింది

-సాంకేతిక విద్యా శాఖకు రూ. 95 కోట్లు
-వీ-హబ్ కు రూ. 15 కోట్లు
-కొత్త కలెక్టరేట్ లు, పోలీసు కార్యాలయాలకు రూ. 500 కోట్లు
-పాఠశాల విద్యకు రూ. 10,830 కోట్లు
-ఉన్నత విద్యారంగానికి రూ. 2,448 కోట్లు

-గురుకులాలకు పాఠశాలలకు రూ. 2,823 కోట్లు
-మైనార్టీ గురుకులాలకు రూ. 735 కోట్లు
-ఎస్సీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు రూ. 1,221 కోట్లు
-ఎస్టీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 401 కోట్లు
-బీసీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 296 కోట్లు

-కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 109 కోట్లు
-ఉద్యోగుల సంక్షేమానికి రూ. 1,023 కోట్లు
-రజకుల ఫెడరేషన్ కు రూ. 200 కోట్లు
-నాయిబ్రహ్మణ ఫెడరేషన్ కు రూ. 250 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు
-న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
-బ్రహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
-గర్భిణీల సంక్షేమానికి రూ. 561 కోట్లు
-ఆరోగ్య లక్ష్మీ పథకానికి రూ. 298 కోట్లు

-ఇప్పటి వరకు 83,048 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చాం
-ఇప్పటి వరకు 27,588 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి

-వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
-భద్రాచలంఆయల అభివృద్ధికి రూ. 100 కోట్లు
-బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున కేటాయింపు
-హోంశాఖకు రూ. 5,790 కోట్లు

-వరంగల్ కు రూ. 300 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
-సాంస్కృతిక శాఖకు రూ. 58 కోట్లు
-యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు

-ఆర్ అండ్ బీకి రూ. 5,575 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు
-చేనేత జౌళి రంగానికి రూ. 1200 కోట్లు
-పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు
-ఐటీ శాఖకు రూ. 289 కోట్లు
-పురపాలక శాఖకు రూ. 7,251 కోట్లు

-ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు
-మైనార్టీల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు
-వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 7,375 కోట్లు
-విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు
-గురుకులాలకు రూ. 2,823 కోట్లు
-మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు

-ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్ల ప్రత్యేక నిధి
-ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు
-ఎస్సీల సంక్షేమానికి రూ. 12,709 కోట్లు
-దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీని రూ. 1469 కోట్లు
-ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు
-బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు

-గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు
-కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు
-మహిళా శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు

-డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు
-నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
-పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు
-రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు
-వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు
-బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు
-పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు
– ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లు

-జీడీపీ ద్రవ్య లోటు 3.45 శాతం
-ఈ ఏడాది రాష్ర్ట జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా
-స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం
-రాష్ర్ట జీడీపీ ఏటేటా పెరుగుతుంది
-ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
-సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలోకి తెచ్చారు
-ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది

సంక్షేమానికి నిధుల వ‌ర‌ద‌
———————————
బ‌డ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి మంచి ప్రాధాన్యం ద‌క్కింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఈట‌ల నిధులు కేటాయించారు. మ‌హిళా, శిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు, ఎంబీసీ సంక్షేమం కోసం వెయ్యి కోట్లు, ర‌జ‌కుల ఫెడ‌రేష‌న్‌కు రూ.200 కోట్లు, మైనార్టీ శాఖ‌కు రూ.2 వేల కోట్లు, గ‌ర్భిణీ సంక్షేమానికి రూ.561 కోట్లు, నాయీబ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్‌కు రూ.250 కోట్లు, ముస్లిం అనాథ పిల్ల‌ల‌కు ఆశ్ర‌య‌మిచ్చే కుల్‌గుర్బా భ‌వ‌న నిర్మాణం కోసం రూ.20 కోట్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల కోసం రూ.1450 కోట్లు, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం రూ.2643 కోట్లు, జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం రూ.75 కోట్లు కేటాయించారు. ఇక ఎస్సీల సంక్షేమానికి రూ.12709 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8063 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.5920 కోట్లు, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూ పంపిణీ కోసం రూ.1469 కోట్లు, ఎస్సీ ప్ర‌గ‌తి నిధికి రూ.16453 కోట్ల ప్ర‌త్యేక నిధి, ఎస్టీ ప్ర‌గ‌తి నిధికి రూ.9693 కోట్ల కేటాయింపులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట‌
——————————————–
ఊహించిన‌ట్లే రాష్ట్ర బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేసింది ప్ర‌భుత్వం. రాష్ట్రాభివృద్ధిలో వ్య‌వ‌సాయ రంగ‌మే కీల‌క‌మ‌ని అన్న ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. బ‌డ్జెట్‌లో మొద‌ట వ్య‌వ‌సాయ రంగానికి చేసిన కేటాయింపుల గురించే ప్ర‌స్తావించారు. ఇందులో ప్ర‌ముఖంగా పెట్టుబ‌డి ప‌థ‌కం గురించి ప్ర‌స్తావించారు. ఈ ప‌థ‌కం కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండు పంట‌ల‌కు క‌లిపి ఎక‌రాకు రూ.8 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ.522 కోట్లు కేటాయించారు. భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న కోసం ధ‌ర‌ణి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. పాలీ, గ్రీన్‌హౌజ్ కోసం రూ.12 కోట్లు. రైతు బీమా ప‌థ‌కం కోసం రూ.500 కోట్లు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. రైతుల‌కు రూ.5 ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు ఈట‌ల చెప్పారు. బిందు, తుంప‌ర సేద్యానికి రూ.127 కోట్లు కేటాయించారు.

‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టతకు చర్యలు’
——————————————————–
అభివృద్ధి ఎప్పుడైనా పునాదుల నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరీకరణను మాత్రమే అభివృద్ధి అనుకుంటాము. అది తప్పు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నది. వ్యవసాయాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూనే వ్యవసాయ అనుబంధ రంగాలకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ వృత్తుల మీద ఆధారపడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా గొల్ల కురుమల సంప్రదాయ వృత్తి గొర్రెల పెంపకానికి సంబంధించి మొదటిదశలో 4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 లక్షల 35 వేల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై 50 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. గంగపుత్ర, ముదిరాజ్, బోయ, బంటు కులస్తులు చేపలు పట్టడమే వృత్తిగా జీవిస్తున్నారు. వీరి సంక్షేమంలో భాగంగా ప్రతీ సంవత్సరం 3,20,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. పట్టిన చేపలు అమ్ముకోవడానికి వీలుగా జిల్లాకు ఒకటి చొప్పున 31 హోల్‌సేల్ చేపల మార్కెట్‌లు, 200 రిటైల్ మార్కెట్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 109 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు 1,450 కోట్లు
——————————————————–
ఆడ పిల్లల వివాహాలు చేయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పేద తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 2018-19 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 1,450 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిరోధించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొదట ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు వర్తింపచేసిన ఈ పథకాన్ని, ఆ తర్వాత బీసీలు, అగ్ర వర్ణాలలో ఉన్న పేదలకు కూడా వర్తింపజేశామన్నారు. ఇప్పటి దాకా కల్యాణలక్ష్మి పథకం కింద 2,12,126 మంది, షాదీముబారక్ కింద 78,003 మంది ప్రయోజనం పొందినట్లు ఈటల వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి 75 కోట్లు
——————————————
సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం పట్ల శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం.. జర్నలిస్టుల సంక్షేమంపై కూడా అదే స్థాయిలో శ్రద్ధ కనబరుస్తుంది. ఈ బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ. 130 కోట్ల నిధిని సమకూర్చింది ప్రభుత్వం. ఈ నిధి ద్వారా అకాల మరణానికి గురైన జర్నలిస్టుల కుటుంబానికి లక్ష రూపాయాల ఎక్స్‌గ్రేషియాతో పాటు, ప్రతి నెలా జీవనభృతిని కల్పిస్తుంది. అలాగే న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు, బ్రహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు, రజకుల ఫెడరేషన్‌కు రూ. 200 కోట్లు, నాయిబ్రహ్మణుల ఫెడరేషన్‌కు రూ. 250 కోట్లు, బీసీల అభివృద్ధికి రూ. 5,920 కోట్లు కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట
———————————————
రాష్ట్ర బడ్జెట్‌లో అణగారిన వర్గాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు అధికంగా కేటాయించింది. ఈ బడ్జెట్‌లో ఎస్సీల ప్రగతి నిధికి రూ. 16,453 కోట్లు, ఎస్టీల ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు ప్రతిపాదించింది. అదే విధంగా ఎస్సీల సంక్షేమ కోసం రూ. 12,709 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ. 8,063 కోట్లు కేటాయించారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ కోసం రూ. 1,469 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 45 నెలల సమయంలో 4,939 మంది దళితులకు 12,745 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీల కోసం 104, ఎస్టీల కోసం 53 గురుకుల పాఠశాలలు స్థాపించారు. ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు పడుతున్న అవస్థలు గమనించిన ప్రభుత్వం, వారి కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలకు ఏర్పాటు చేసింది. తొలి దశలో ఎస్సీల కోసం 30, ఎస్టీల కోసం 22 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. ఎస్సీ గురుకులాలకు రూ. 1,221 కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 401 కోట్లు కేటాయించారు.

విద్యుత్ రంగానికి 5,650 కోట్లు
————————————-
విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన ప్రగతిని సాధించినట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని.. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 31 మెగావాట్ల సౌర విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేది. నేడు 3,283 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏకైక రాష్ట్రంగా అరుదైన ఘనతను తెలంగాణ సొంతం చేసుకుందని స్పష్టం చేశారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 28,275 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే 15,344 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చామన్నారు.

హోంశాఖకు 5,790 కోట్లు
———————————-
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునీకరించిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలను మెరుగుపరిచామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో హోంశాఖకు రూ. 5,790 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకాలు జరపడంతో పాటు, కావాల్సిన వాహనాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు అందించి ఈ శాఖను పటిష్టపరిచినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7 పోలీసు కమిషనరేట్లతో పాటు 27 కొత్త పోలీసు సబ్ డివిజన్లు, 29 సర్కిళ్లను, 103 పోలీసు స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat