ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై చంద్రబాబు బుధవారం రాత్రి స్పందించారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేసిన వాఖ్యలుసాక్షిలో ప్రచురితమైన వార్తలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
‘సాక్షి’ పత్రికలో గతంలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారన్నారు. వాటిల్లో ఎటువంటి వాస్తవమూ లేదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తెచ్చి చదివినట్టుందని, పవన్ కల్యాణ్‌ను ముందు నిలబెట్టి ఎవరో కొత్త నాటకం ప్రారంభించారని చంద్రబాబు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఒక్కో సినిమాకు ఒక్కో రచయిత మాటలు రాసినట్టే ఉందని అభిప్రాయపడ్డారు. విషయం లేని విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం రాబట్టడానికి తెలుగుదేశం పార్టీ తన సర్వశక్తులూ ఒడ్డి కేంద్రంపై పోరాడుతుంటే ఈ సమయంలో తమపై ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. మేం కేంద్రంపై పోరాటం చేస్తుంటే మాపై గురి పెట్టి మాట్లాడిస్తోంది ఎవరు? ఎవరి తరపున మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని ఒక్క మాట అనడానికి నోరు రాకపోతే ఎలా? కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత ఆగ్రహం వ్యక్తమవుతుంటే వాళ్ల వైఖరి గురించి మాటైనా లేకుండా మాపై పడుతున్నారంటే అర్థమేంటి అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.