సినీ నిర్మాతతో ఓ ఎమ్మెల్యే కూతురు లేచిపోయిందని గురువారం బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తన కుమార్తె కనపడంలేదని, ఆచూకి కనిపెట్టాలని బెంగళూరు నగరంలోని యలహంక న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా మాయనకోండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కు లక్ష్మి నాయక్ (30) అనే కుమార్తె ఉంది. రెండు రోజులుగా తన కుమార్తె కనపడటం లేదని గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్యాండిల్ వుడ్ సినీ నిర్మాత సుందర్ పి. గౌడను వివాహం చేసుకుంటానని ఎమ్మెల్యే కూతురు లక్ష్మి నాయక్ ఆమె తండ్రి శివమూర్తి నాయక్ కు చెప్పారు. అయితే వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ సినిమా డైలాంగ్ చెప్పాడని తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ ఆయన కులానికి చెందిన యువకుడితో లక్ష్మి నాయక్ తో నిశ్చితార్థం చేయించాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని లక్ష్మి నాయక్ ఇంటి నుంచి పారిపోయారని తెలిసింది. తాను ప్రేమించిన సినీ నిర్మాత సుందర్ పి. గౌడను వివాహం చేసుకుంటానని, ఇంటిలో చూసిన సంబంధం తాను చేసుకోనని లక్ష్మి నాయక్ ఆమె స్నేహితులకు చెప్పినట్లు సమచారం. గౌడ, లక్ష్మి నాయక్ మైసూరులో ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. గురువారం వారి సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.