ప్రస్తుతం ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు అంశాలపై దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. విభజన హామీలను నెరవేర్చాలంటు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రంతో వున్న పొత్తును ఏపీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్‌లో మోదీ చర్చించినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ పోరాటం ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మరోసారి చలనం రాగా, మంత్రుల రాజీనామాలపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ, మిత్రపక్ష సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.వీరిద్దరి సంభాషణలో ప్రధానంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరి మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు వివరించినట్టు సమాచారం.
కాగా, నేటి సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రధాని మోదీని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.ప్రధాని నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి తమ రాజీనామా పత్రాలను నరేంద్ర మోదీకి సమర్పించారు. పార్టీ అధిష్ఠానం సూచనలు మేరకు ఇద్దరూ మంత్రి పదవులనుంచి వైదొలిగారు.ప్రధానితో ప్రత్యేక హోదాపై చర్చించిన తర్వాత ఈ ఇద్దరు మంత్రులు తమ రాజీనామా లేఖలను మోదీకి సమర్పించనున్నట్లు సమాచారం