కాంగ్రెస్ నాయకుల బస్ యాత్ర కాస్త తుస్ యాత్రగా మారిందని, అందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మద్య ఐకమత్యం లేదు, వారికి ప్రజల నుండి స్పందన లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు నిజామాబాద్ లో మీడియా సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు తప్ప, సామాన్య ప్రజలకు మీ బస్ యాత్ర పట్ల గౌరవం, మర్యాద లేదు. ఒక్క బస్ యాత్రనే కాదు మనిషికో బస్ వేసుకోని తిరిగినా మీ బతుకు అంతే. ప్రస్తుతం ఉన్న రెండంకెల స్థానాలు కూడా గెలవరని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలు తమ పరిపాలన తీరును ఆలోచించుకోవాలని మంత్రి పోచారం సూచించారు. `కేసీఆర్ మూడున్నర ఏళ్ళలోనే ఇన్ని పథకాలు, కార్యక్రమాలు చెస్తే 70 ఏళ్ళ మీ పాలనలో ఏంచేశారు ?. మీ హయంలో ఏం చేశారు ? . పంటలను ఎండగొట్టి రైతుల గొస పోసుకున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని తమకు డిపాజిట్ లు రావనే భయంతో చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో TRS ఖచ్చితంగా 100 నుండి 106 స్థానాలలో గెలుస్తుంది. ఇది ప్రజల నాడి. గ్రామాలకు గ్రామాలే TRS కు మద్దతు తెలపుతున్నాయి` అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇంచార్జీ కుంతియాను స్టేజి మీద నుండి పడవేశారని అది కాంగ్రెస్ నేతల తీరు అని మంత్రి పోచారం పేర్కొన్నారు. `మీ యాత్రంతా బస్సు, తుస్సు, కస్సు. మీ పరిపాలన బాగుండి ఉంటే ఏమైనా ప్రజలు నమ్మేవారు. మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఈ యాత్రలన్నీ రాజకీయ పబ్బం కోసమే తప్ప మరోకటి కాదు. దేశంలో ప్రజలు కాంగ్రేస్ పరిపాలనను, ప్రత్యామ్నాయమైన బిజేపి పరిపాలనను చూసారు. నేడు రాష్ట్రంలో ఉద్యమ నాయకుడైన కెసిఆర్ పరిపాలనను చూస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ పరిపాలనను అందిస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్. అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలన బాగుందని కితాబు ఇస్తున్నారు. ప్రజలకు ఏది ఆమోదయోగ్యమో, ప్రజలకు అవసరమైన పథకాలనే అమలు చేస్తున్నారు` అని మంత్రి పోచారం స్పష్టం చేశారు.