ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది.అందులో భాగంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరిపోతారన్న వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటులుగా ఉన్న వారు సైతం పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
బాబుకు ఎంతో సన్నిహితంగా ఉండే ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు ఇప్పటికే ఈ లిస్టులో ఉంది.అయితే ఇప్పుడు బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉండే లీడర్లలో ముందు వరుసలో ఉండే మాజీ మంత్రి, కార్మిక సంఘం నేత సైతం టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ నుంచి ఓ కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలుపొందారు. చంద్రబాబు క్యాబినెట్‌లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వాహించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగు అయిపోతుండడంతో పెద్దిరెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.