ఫుడ్ ప్రాసెసింగ్ పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రేపు (మంగళవారం ) సెక్రెటేరియట్ లో సమావేశం కానుంది.రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఆహార పరిశ్రమల(ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యవసాయరంగంతో పరిశ్రమలను అనుసంధానం చేయాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫుడ్ ప్రాసేసింగ్ విధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేయనున్నది.ఆహార కల్తీ నిరోధానికి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి, పంటలకు మద్దతు ధర సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు, పరిశ్రమల మంత్రి కెటిఆర్ లతో కేబినెట్ సబ్ కమిటీని సీఎం నియమించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఫుడ్ ప్రాసెసింగ్ కేబినెట్ సబ్ కమిటీ చర్చించనున్నది.
