రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కూడా ఒక పార్టీని కాదనుకుంటే మరొక పార్టీకి ఓట్లేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దేశాభివృద్ధి కోసం సిఎం కేసిఆర్ చేసిన ప్రత్యామ్నాయ ప్రకటనను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారని, దేశంలోని సమస్యలపై అధ్యయనం చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసమే దేశంలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఉండాలని సిఎం కేసిఆర్ ప్రకటించారన్నారు. భారతదేశం కంటే తర్వాత స్వాతంత్ర్యం పొందిన శ్రీలంక కూడా విద్యా, వైద్య రంగాల్లో మనకంటే ముందుందని గుర్తు చేశారు. దేశంలో సరైన విద్య, వైద్యావకాశాలు లేక, కరెంటు వెలుతురులు లేక, తాగడానికి రక్షిత మంచినీరు అందక, రైతుకు మద్దతు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలన్ని చూశాకే సిఎం కేసిఆర్ కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయం తీసుకురావాలని ఆలోచించారన్నారు. దేశంలోని ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలంటే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం రావాలన్నారు.
SEE ALSO :వరంగల్ మోనోరైల్‌కు గ్రీన్ సిగ్నల్..
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఇన్నేళ్లు పాలించి అవినీతిని చట్టబద్దం చేసిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఉప ముఖ్యమంత్రి కడియం ఆరోపించారు. ఇక బిజెపి పాలనలోకి వచ్చి బ్యాంకులను లూటి చేసిందన్నారు. ఈ బ్యాంకుల దోపిడి వెనుక ఎన్డీఏ హస్తం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. నిజంగా పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా బిజెపి పనిచేస్తే ఈ బ్యాంకులను లూటి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. బ్యాంకుల్లో సంస్కరణలు ఎందుకు తీసుకురావడం లేదన్నారు. నిత్యం రైతుల కోసం మాట్లాడే ప్రధాని నరేంద్రమోడీ రైతుల కోసం ఇంతవరకు ఒక కొత్త పథకం ఎందుకు ప్రకటించలేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రోజుకు నాలుగుసార్లు బట్టలు మార్చడం, స్పెషల్ ఫ్లైట్లలో విదేశాలకు తిరగడం తప్ప క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వంలో బ్యాంకులను ముంచి విదేశాలకు చెక్కేసే విధానం వచ్చిందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల అభివృద్ధి, పేదరిక నిర్మూలన ఎజెండాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. మనకంటే వనరులు లేని దేశాలు అభివృద్ధిలో మనకంటే ముందుకు వెళ్తున్నాయని, మనం ఎందుకు వెనుకబడి ఉన్నామని ప్రశ్నించారు.
SEE ALSO : పవన్‌కు తిట్లు.. మహేష్‌కు ప్రశంసలు..!!
దేశంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో, వ్యవసాయానికి పెద్ద పీట వేసి దానికి మద్దతు ఇవ్వడంలో బిజెపి విఫలమైందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేశామని, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, పంటకు ఎకరానికి 4వేల రూపాయలను రైతుకు అందిస్తున్నామని, ఇవన్నీ తెలంగాణలో చేస్తుండగా…భారతదేశంలో ఎందుకు చేయడం లేదన్నారు. ముడుపులకు ఆశపడి కాంగ్రెస్, బిజెపిలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని సమస్యలు తెలిసి వాటిని పరిష్కరించే నాయకత్వం గల నాయకుడు వందకు వంద శాతం ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. ఆరు దశాబ్దాల పోరాటాన్ని భుజాన వేసుకుని కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన కేసిఆర్, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించి దేశం, ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా చేశారన్నారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలిసి,వాటిని పరిష్కరించగల దూరదృష్టి ఉన్ననాయకుడు కేసిఆర్ అని కొనియాడారు. వ్యవసాయం గురించి, రైతు గురించి క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు కేసిఆర్ మిచిన వారు మరొక నాయకుడు లేరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయం రావాలని బలంగా కోరుకుంటున్నామన్నారు.
ఇక వామపక్ష పార్టీలు దేశంలో రోజురోజుకు బలహీన పడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల నాయకత్వంలో ఉన్న బేషజాలే ఆ పార్టీల బలహీనతకు కారణమన్నారు. సిద్దాంత పరంగా పార్టీలలో పెద్ద తేడా లేకపోయినా…నాయకుల మధ్య వైరుద్యాలతో ప్రజల తరపున ప్రశ్నించే వామపక్షాలు బలహీనమయ్యాయని అన్నారు. ఇప్పటికైనా వారి మధ్య బేషజాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని కోరారు. వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకో, బిజెపికో మద్దతు ఇవ్వకుండా కేసిఆర్ ప్రత్యామ్నాయానికి మద్దతు ఇవ్వాలన్నారు.
తెలుగు ప్రజలంతా కేసిఆర్ ప్రత్యామ్నాయానికి పూర్తి మద్దతు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. బిజెపి తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక రకమైన వివక్షతను, ఆంధ్రప్రదేశ్ పట్ల మరొక రకమైన వివక్షతను ప్రదర్శిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రద్యేశ్ కు ప్రత్యేక హోదా అనేది కావాలంటే కేసిఆర్ ప్రత్యామ్నాయానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఇక కాంగ్రెస్, బిజెపిలకు స్థానం లేదన్నారు.
ఈ సమావేశంలో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మేయర్ నన్నపనేని నరేందర్, చైర్మన్లు మర్రియాదవరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, కిషన్ రావు, రాజయ్య యాదవ్, వాసుదేవ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.