పాపం . బీజేపీ తెలంగాణ నేతల చెప్పుడు మాటలు విని ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ నాయకులు ఆగమైతున్న తీరు చూస్తుంటే జాలి కలుగుతున్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం కరీంనగర్ రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఒక గంటా 13 నిమిషాల 40 సెకండ్ల పాటు భారత దేశ రైతాంగంతో పాటు తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఎంతో లోతైన అవగాహనతో సుదీర్ఘంగా ప్రసంగించారు . ఆ స్పీచ్ మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విన్న వారికి రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత సాఫ్ట్ కార్నర్ ఉందో అర్ధమవుతుంది .
see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..
ఈ దేశంలో ఉన్న నదుల మీద , వర్షపాతం మీద , మొత్తం టీ ఏం సి ల వివరాల మీద , అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాల మీద , చైనా లాంటి దేశాలు సాగు నీటి విషయంలో చూపిస్తున్న శ్రద్ధ మీద , ఈ దేశ బడ్జెట్ లో కేటాయింపుల నిర్లక్ష్యం మీద , ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించటం మీద … ఇట్ల చెప్పుకుంటూ పోతే ఆ ప్రసంగంలో ఎన్నో అంశాలను సీఎం కేసీఆర్ ఎంతో ఆవేదనతో ప్రస్తావించారు . అయితే తెలంగాణ మాండలికం మాటల ఫ్లో లో సాగే ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎక్కడో ఒక చోట పొరపాటుగా ఏకవచన సంబోధన జరిగి ఉండొచ్చు . ప్రసంగం మొత్తం వింటే అది ఫ్లో లో జరిగినట్లుగా అర్ధమవుతుంది . అదే కంటిన్యుటీలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఉద్దేశించి ‘ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ గారికి , కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారికి “ అని కూడా ప్రస్తావించారు . మొదటి నుండి కేసీఆర్ ప్రసంగం అదే తరహాలో ఉంటుంది . అయితే తెలంగాణ బీజేపీ నాయకులు ఆ స్పీచ్ లో పొరపాటుగా దొర్లిన పదాన్ని మాత్రమే కట్ చేసి కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కు చూపించడంతో ఆమె కాస్త ఎక్కువగా రియాక్ట్ అయినట్లు అర్ధమవుతున్నది . అయితే ఆమె మొత్తం ప్రసంగం జాగ్రత్తగా చూసి ఉంటే అర్ధం చేసుకుని ఉండేదేమో .
ఇక గా చిన్న మిస్టేక్ ను చూపించి కేంద్ర ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగాధం పెంచి పండుగ చేసుకుందామని తెలంగాణ బీజేపీ నాయకులు ఒకటే కలలు కంటున్నరట ! కేంద్రం ల బీజేపీ ఉంది కాబట్టి రాత్రికి రాత్రి తెలంగాణ మీద తుపాకి పెట్టినట్లు ఒకటే ఆగమైతున్నరు . కాకపోతే తెలంగాణ బీజేపీ నాయకులు ఒక విషయం మర్షిపోతున్నరు . నిజంగానే కేసీఆర్ తప్పులు చేసేటోడైతే కేంద్రం ల , సమైక్య రాష్ట్రం ల అధికారం ల ఉన్న గా కంత్రీ కాంగ్రెసోళ్లు , అందులో ఆంధ్రా పాలకులు , ఆంధ్రా మీడియా ఊకునేవా ? కేసీఆర్ బయపడేటోడైతే 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపించగలిగేవాడా ? ప్రాణాలకు తెగించి మూడున్నర కోట్ల మందిని ఉర్రూతలూగించేవాడా ? కేంద్రం మెడలు వంచి తెలంగాణ ను ప్రకటింపజేసేవాడా ? 2001 లో దొంగ నోట్ల కేసు మోపే ప్రయత్నం కాన్నుంచి 2014 వరకు కేసీఆర్ ను , తెలంగాణ ఉద్యమాన్ని కుట్రలు కుతంత్రాలతో అణగ దొక్కాలని చేసిన ప్రయత్నాలు ఈ ప్రపంచానికి తెలుసు . అప్పుడు ఉద్యమ రథసారధిగా కేసీఆర్ ఎంతో నిజాయితీగా , నిబద్దతతో ఉండబట్టే తెలంగాణ సాధన సాధ్యమైంది . ఇప్పుడు కూడా ఎంతో పట్టుదలతో , సంకల్ప బలంతో నిర్ణయాలు తీసుకుంటున్నందువల్లే బంగారు తెలంగాణ కు సరైన దిశగా అడుగులు పడుతున్నయి .
see also :8వ వింత ..జగన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం..!
ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేకంగా ఒరగబెట్టిన మేలేమిటో ఆ పార్టీ రాష్ట్ర , జాతీయ స్థాయి నాయకులు తెలంగాణ ప్రజలకు ముందు సమాధానం చెప్పాలె . పోలవరం కోసం ఏడు మండలాలను గుంజుకొని తెలంగాణ కు మేలు చేసిండ్రా ? ఇప్పటి వరకు హైకోర్టు ను ఏర్పాటు చేయకుండా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి మేలు చేసిండ్రా ? మొదట్లో 7 నెలల పాటు సివిల్ సర్వీస్ అధికారులను కేటాయించకుండా ఆలస్యం చేసి , 45 నెలలైనా ఇప్పటివరకు విభజన ప్రక్రియ పూర్తి చెయ్యకుండా తెలంగాణ ను ఉద్ధరించిండ్రా ? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలె . సరే రాజ్యాంగ బద్దంగా కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ … నోట్ల రద్దు కాన్నుండి , జీ ఎస్టీ , రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నిక వరకు అన్నీటికి మనస్ఫూర్తిగా సహకరించినందుకు కృతజ్ఞతగా విశ్వాసం లేకుండా బీజేపీ నేతలు చిన్న విషయానికి అతి చేస్తూ తమ చిల్లర బుద్ధిని బయట పెట్టుకుంటున్నరు . మొన్న గుజరాత్ లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బతికి బయట పడ్డ బీజేపీ దేశంలో తమ మీద వ్యతిరేకత పెరుగుతున్న విషయాన్ని గమనించలేకపోతున్నది .
see also :జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!
చిల్లర విషయాలు పక్కన పెట్టి 18 లక్షల కోట్ల దేశ బడ్జెట్ లో కనీసం ఓ రెండు లక్షల కోట్లు కేంద్రం రైతుల కోసం ఎందుకు కేటాయించలేక పోతున్నదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నకు బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి . ఇప్పటికైనా చిల్లరగా ప్రవర్తించడం మానుకుని కేంద్రం హుందాగా నిర్ణయాలు తీసుకోవాలి . ఉడుత ఊపులకు కేసీఆర్ భయపడడనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకుంటే మంచిది . కరీంనగర్ మీటింగ్ లోనే అవసరమైతే జాతీయ స్థాయి రైతు ఉద్యమానికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందని దైర్యంగా ప్రకటించిన కేసీఆర్ మొత్తం ప్రసంగాన్ని బీజేపీ నాయకులు మళ్ళీ ఒకసారి చూస్తే ఆయనకు ఉన్న దమ్ము ఏమిటో రైతుల పట్ల ఆయనకు ఎంత మమకారం ఉందో అర్ధమవుతుంది .