తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్లేవారు పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఖమ్మం ప్రధాన పోస్టాఫీసులో నూతనంగా ఏర్పాటుచేసిన రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్ ను పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత చదువులకోసం, అపార ఖనిజ నిక్షేపాల కలిగిన ఖమ్మం జిల్లాలోని వ్యాపారులు ఎగుమతుల కోసం విదేశాలకు అధిక సంఖ్యలో వెళుతున్నారని చెప్పారు.
వారు పాస్ పోర్ట్ కోసం పడుతున్న కష్టాలను గమనించి ఖమ్మంలో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఇక పాస్ పోర్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించే అవసరం లేకుండానే ఖమ్మం కేంద్రంలో పాస్ పోర్ట్ పొందే విధంగా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ కార్యాలయం వల్ల మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం తో పాటు మరో నాలుగు పాస్ పోర్ట్ కార్యాలయ కు అనుమతి లభించిందన్నారు. మరికొద్ది రోజుల్లో నల్లగొండ, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లో కూడా పాస్ పోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గడిపల్లి కవిత, తాటి వెంకటేశ్వర్లు, మేయర్ పాపాలాల్, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.