సినీనటి శ్రీదేవి మృతి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి అందరితో కలిసి ఉత్సాహంగా ఫొటోలు దిగారు. వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె ఇప్పటికీ, ఎప్పటికీ అతిలోక సుందరే.
శ్రీదేవి మరణ వార్తతో సినీ ప్రపంచం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీదేవి చివరిగా బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహ వేడుకలో సందడి చేశారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. అందరితో ఫోటోలు దిగుతూ ఉత్సాహం గడిపారు. ఆమె చివరి జ్ఞాపకాలు.. ఆఖరి క్షణాల్లో తీసుకున్న ఫోటోలను చూసి ఆమె అభిమానులు విలపిస్తున్నారు.
ఇక శతన నటనతో ఎన్నో అవార్డులు, ప్రశంసల్ని అందుకున్న శ్రీదేవికి.. భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. శ్రీదేవి తన సుధీర్గమైన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ కాగా… నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం మూవీకి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అలాగే ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్‌గా శ్రీదేవి ఎంపికయ్యారు. ఇవి కాక ఆమె ఎన్నో ప్రశంసల్ని అందుకున్నారు.