మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో వారు హైదరాబాద్ పోలీసులకు సమచారం అందించారు..దీంతో ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.గతేడాది నవంబర్‌లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్ ను అరెస్టు చేశారు. ఆయన వద్ద జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశంలో కొంతమంది సెలబ్రిటీలను చంపడానికి జరిగిన కుట్ర వెనుక దావూద్ హస్తమున్నట్లు సమాచారం. అయితే ఆ సెలబ్రిటీ ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. కనీసం ఏ రంగానికి చెందినవాడో అన్న క్లూ కూడా బయటకు రాలేదు. బహుశా సినీ రంగానికి చెందిన వ్యక్తే అయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . అంతేగాక ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తుండగా, ఇటీవల అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఈ షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి.
