Home / TELANGANA / రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ కార్డులు

రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ కార్డులు

రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల విద్యాలయాలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినిలందరీకి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే కేజీబీవీలు, గురుకుల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని 3 లక్షల మందికి విద్యాశాఖ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డికి తెలిపారు. హెల్త్ కిట్స్ లో అందిస్తున్న వస్తువులను కూడా మంత్రి లక్ష్మారెడ్డికి, అక్కడున్న ఆరోగ్యశాఖ అధికారులకు చూపించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్య, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో ఈ ఆరోగ్య పరీక్షలు జరపాలని, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని నేడు సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులిద్దరు నిర్ణయించారు.

రానున్న విద్యా సంవత్సరంలో జూలై నెల నుంచి విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు జరపాలని ఈ సమావేశంలో మంత్రులు కడియం శ్రీహరి, డాక్టర్ లక్ష్మారెడ్డిలు అధికారులకు ఆదేశాలిచ్చారు. 31 జిల్లాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ విద్యాలయాల్లోని విద్యార్థులందరికీ పరీక్షలుచేసి హెల్త్ కార్డులు అందించాలని చెప్పారు. ఇందుకోసం విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినిలకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు వారికి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే మూడు లక్షల మంది విద్యార్థినిలకు విద్యా శాఖ తరపున ఇస్తున్నామని, రానున్న విద్యా సంవత్సరం నుంచి మరో 5 లక్షల మంది విద్యార్థినిలకు ఇచ్చే విధంగా ఈ రెండు శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే 7,8,9,10 తరగతి విద్యార్థినిలందరికీ వారికి యుక్తవయస్సుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, సంరక్షణపై కూడా అవగాహన తరగతలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిలు సంయుక్తంగా నిర్ణయించారు. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ తరపునుంచి విద్యాశాఖలోని కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా బాలికల్లో రక్తహీనత సమస్యను దూరం చేసే విధంగా ఇప్పటికే గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో అన్ని పోషకాహారాలందించే మెనును అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. మిగిలిన పాఠశాలల్లో కూడా విద్యార్థినులలో ఈ రక్తహీనతను అధిగమించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆరోగ్య శాఖ సూచించాలని కోరారు.

రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య కార్డులు ఇవ్వడం, విద్యార్థినులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వడం రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ ఒక్కటేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అధికారులకు తెలిపారు. కచ్చితంగా ఈ రెండు కార్యక్రమాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా విద్యార్థులందరి భవిష్యత్ దృష్ట్యా పటిష్టంగా అమలు చేసే కార్యాచరణ రూపొందించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య కార్డులు ఇవ్వడానికి ఒక్కో జిల్లాలో, ఒక్కో స్కూల్ కు ముందే షెడ్యూల్ విడుదల చేసి, ఆ తేదీలల్లోనే పరీక్షలు నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని అధికారులకు మంత్రులిద్దరికీ హామీ ఇచ్చారు. వీటితో పాటు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించే బాధ్యత కూడా రెండు శాఖలు సంయుక్తంగా చేపడుతాయని, ఈ కార్యక్రమం చాలా మంచిదని అన్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమార్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, ఎన్..హెచ్.ఎం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat