కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలియజేశారు.
టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వాల కోసం రూ.13.50లక్షలు చెల్లిస్తే.. ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు. సభ్యత్వ కార్డులను.. కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు దొంగలించారని ఆరోపించారు. విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ కావాలని వర్ల రామయ్య, ఇన్‌చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనను బతిమిలాడినా లెక్క చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలైన మానుకొంటాను కాని, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి పనిచేసే సమస్యే లేదని..పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్నారు. దీన్ని బట్టి చూస్తే..మళ్లీ వైసీపీలోకి వచ్చే లాగ ఉన్నారని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు తెగ హల్ చల్ చేస్తున్నారు.