కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ర్టాల జలవనరుల ప్రాంతీయ సదస్సు జరిగింది. దక్షిణాది రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరైన ఈ సదస్సులో జలవివాదాలకు అంతం పలకడం, కోర్టుల వెలుపల పరిష్కారాలే లక్ష్యంగా చర్చ జరిగింది. సదస్సులో దక్షిణాది రాష్ర్టాల జలవివాదాల పరిష్కారానికి రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జలవివాదాలకు జాతీయస్థాయిలో ఒకే ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. ఒక్కో నది కోసం ఒక ట్రైబ్యునల్ పెట్టడం వల్ల కాలయాపన జరుగుతున్నదని మంత్రి అభిప్రాయపడ్డారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ 14 ఏళ్లుగా పనిచేస్తున్నా తుది తీర్పు రాలేదన్నారు.
ఆర్డీఎస్ ఆధునీకరణ పనులకు ఏపీ అవరోధాలు సృష్టిస్తోందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని హరీశ్‌రావు కోరారు. ఏపీ, కర్నాటక, తెలంగాణల మధ్య ఆర్డీఎస్‌పై త్రైపాక్షిక ఒప్పందం అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదు. పాతవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేస్తున్నాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టు అని కేంద్రప్రభుత్వమే ధ్రువీకరించిందన్నారు. కాళేశ్వరం విషయంలో ఏపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. పోలవరం వల్ల తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కేంద్రం జోక్యం చేసుకుని ముంపును నివారించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించలేక పోతున్నామన్న హరీశ్ రావు వ్యాఖ్యలతో కేంద్రం ఏకీభవించింది. జలవివాదాలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో ఒక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రైబ్యునల్స్ ఉండవని తేల్చిచెప్పారు. మార్చి – ఏప్రిల్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఒకే ట్రైబ్యునల్ బిల్లును ఆమోదిస్తామని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు.