ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ లో టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్బుక్ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్బుక్ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 20 మంది మహిళలు ఇతగాడి బారిన పడ్డారు.
వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా బుక్కరాయపట్నంకు చెందిన రంగస్వామి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడ్డాడు. జల్సాలకు అలవాటు పడ్డ అతడు చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడేవాడు. చదివింది ఐదో తరగతే అయినా ఫేస్బుక్ వాడటంలో రంగస్వామి దిట్ట. దీన్నే అస్త్రంగా భావించిన అతడు ఒంటరి మహిళలను టార్గెట్ చేశాడు. వారిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి లక్షల్లో దండుకొని పరారయ్యేవాడు. నగరంలోని నాచారం, లాలాపేట్, లాలాగూడలకు చెందిన సుమారు 20 మందికి పైగా మహిళలు మోసపోయారు. అయితే లాలాగూడకు చెందిన ఓ మహిళ రంగస్వామి తనను మోసం చేశాడని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి లక్షల్లో వసూలు చేసి పరారయ్యాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.