Home / TELANGANA / రైతన్నలకు పంట సాయం గొప్ప పథకం..!

రైతన్నలకు పంట సాయం గొప్ప పథకం..!

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అచ్చెరువొందారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, బాలింతలకు కేసీఆర్ కిట్, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతులకు పంట పెట్టుబడిలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనంచేసి, అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. రైతులకు పంట పెట్టుబడి గొప్ప పథకమని ప్రశంసిస్తూ.. ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి విడుత చెక్కుల పంపిణీని జాతీయ కార్యక్రమం (నేషనల్ ఈవెంట్)గా నిర్వహించాలన్నారు. తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన సుపరిపాలనకు గుండెకాయవంటిదని అభివర్ణించారు.

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యయానికి వెనుకాడకుండా అమలుచేస్తున్న కేసీఆర్ కిట్స్ చాలా గొప్ప కార్యక్రమమని, ఇది తననెంతో ప్రభావితం చేసిందని చెప్పారు. శాంతిభద్రతలు బాగుంటేనే ప్రగతి సాధ్యమని చెప్తూ.. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అభినందించారు. స్త్రీ, పురుష నిష్పత్తిలో కూడా రాష్ట్రంలో ఎక్కువ వ్యత్యాసం లేకపోవడం ప్రగతిశీలమన్నారు. సీఎం ఆహ్వానంమేరకు సోమవారం ప్రగతిభవన్‌కు వచ్చిన సుబ్రమణ్యన్.. కేసీఆర్ ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, పంట పెట్టుబడి పథకం, రికార్డుల ప్రక్షాళన, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, టీఎస్‌ఐపాస్, గురుకుల స్కూళ్లు, కేసీఆర్ కిట్స్, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి, మైనార్టీల సంక్షేమం, హరితహారం తదితర కార్యక్రమాలపై ప్రభుత్వ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో రూపంలో ప్రదర్శించారు.

దేశమంతా తెలంగాణ కార్యక్రమాలు అమలుచేయాలి: అరవింద్

భూరికార్డుల ప్రక్షాళన చాలా గొప్పకార్యక్రమమని, దేశమంతా ఈ విధంగా చేయాలని అరవింద్ అభిప్రాయపడ్డారు. మొదటి విడుతలోనే 93% భూముల రికార్డులు క్లియర్‌చేసి, యాజమాన్యహక్కులపై స్పష్టతనివ్వడం అద్భుతమన్నారు. పేదగర్భిణులు కూలిపనులకు వెళ్లకపోవడం వల్లకలిగే వేతననష్టాన్ని కేసీఆర్ కిట్స్ పథకంద్వారా ప్రభుత్వమే భరిస్తుందని సుబ్రమణ్యన్‌కు సీఎం వివరించారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అందించడంతోపాటు తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన రూ.3 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో అరవింద్ ఎంతో ప్రభావితమయ్యారు. కేసీఆర్‌కిట్‌ను అడిగిమరీ తెప్పించుకొని, ప్రతి వస్తువునూ పరిశీలించారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని, దీనిగురించి కేంద్రానికి వివరిస్తానని తెలిపారు. ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. హరితహారం, భారీ ఎత్తిపోతల పథకాలు చక్కగా అమలవుతున్నాయని అభినందించారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని, అప్పుడు కేసీఆర్‌కిట్స్, ఎత్తిపోతల పథకాలు, హరితహారంలాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. కల్యాణలక్ష్మి-షాదీముబారక్‌ద్వారా ఆడపిల్లల పెండ్లిళ్లకు రూ. 75,116 చొప్పున సాయం అందించడాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వమే ఆడపిల్లకు కట్నం ఇస్తున్నట్టా! అంటూ హాస్యోక్తి విసిరారు.

దూసుకుపోయే రాష్ర్టాలను నిలువరిస్తే ఎలా?

ప్రగతిపథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు నిధులు తగ్గించకుండా, ప్రోత్సహించేలా కేంద్ర విధానం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అరవింద్ సుబ్రమణ్యన్‌తో అన్నారు. ఈ దిశగా కేంద్రం ఆలోచించేలా చొరవ చూపాలని కోరారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించడాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ ముందడుగు వేసే రాష్ట్రాలను నిలువరించే చర్యలు మానుకోవాలని అన్నారు. ఆదాయవృద్ధిలో ముందంజలో ఉండి, చేసిన అప్పులను తీర్చగలిగే శక్తి ఉన్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని కోరారు. దేశ తలసరి ఆదాయం రూ.1.03 లక్షలుంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.55 లక్షలని చెప్పారు. జీఎస్టీకి ముందు తెలంగాణ ఆదాయం వృద్ధిరేటు 21% ఉంటే, జీఎస్టీ అమలు తరువాత కూడా 16.5% వృద్ధిరేటుతో దేశంలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2013-14లో 23 జిల్లాల ఉమ్మడి ఏపీ బడ్జెట్ రూ.1.36 లక్షల కోట్లయితే, 2017-18లో తెలంగాణ బడ్జెట్ రూ.1.49 లక్షలకోట్లని వివరించారు. ఇంత ముందడుగువేస్తున్న రాష్ర్టానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచి, మరింత తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్రాలు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తుందని, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటే దేశప్రగతికూడా కుంటుపడుతుందన్నారు.

కాగితాలకే పరిమితమైన గోదావరి, కృష్ణా నదుల్లో నీటి వాటా

తెలంగాణ రాష్ట్రంలో రైతులే ఎక్కువమంది ఉన్నారని, వారు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సుబ్రమణ్యన్‌కు చెప్పారు. అందుకే రాష్ట్రంలో రైతుసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వ్యవసాయరంగాభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న నీటి వాటా కేవలం కాగితాలకే పరిమితమైందని చెప్పారు. సమైక్యపాలనలో నీళ్లు తెలంగాణ పొలాలకు రాలేదన్నారు. అందుకే సాగునీటిరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, కాళేశ్వరం, పాలమూ రు, సీతారామలాంటి భారీప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. గూగుల్‌మ్యాపులద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయనకు వివరించారు.గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంతో 2600 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. 2020 నుంచి తెలంగాణలో రైతులు రెండు పంటలు పండించుకుంటారని, తెలివైన రైతు మూడు పంటలనుకూడా సాగుచేసే అవకాశం ఉందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, నీరు అందితే దాదాపు రాష్ట్ర బడ్జెట్‌తో సమానంగా ఏటా రూ.1.25 లక్షల కోట్ల విలువైన పంటలు పండిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధా న సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శాంతికుమారి, ఎంపీ బాల్కసుమన్, మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ డిమాండ్లు

సీఎం కేసీఆర్ పలు డిమాండ్లను సుబ్రమణ్యన్ వద్ద ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా ఉన్నందున కేంద్రానికి తమ మొర వినిపించాలని కోరారు.
-దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఉద్యోగులకు ప్రతి ఏటా రెండుసార్లు డీఏ సవరిస్తారు. ప్రతి ఐదేండ్లకోసారి పీఆర్సీ వేస్తారు. కానీ రైతులకు అలాంటి వెసులుబాటులేదు. ఎప్పుడో నిర్ణయించిన కనీస మద్దతు ధర సవరించాల్సిన అవసరముంది. గోధుమలు, ధాన్యానికి రూ. 2200, మక్కలకు రూ.2000 మద్దతుధర ప్రకటించాలి.
-వ్యవసాయానికి అనుబంధంగా ఉండే గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం, కోళ్ల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించడం ఎంత వరకు సబబు? వీరిని ఆదాయం పన్ను పరిధి నుంచి తొలిగించాలి.
-కేంద్ర పథకాలద్వారా రాష్ట్రాలకిచ్చే నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలి. ఏ శాఖకు ఎన్ని నిధులిస్తున్నారో వాటిని రాష్ట్రాలకు విడుదలచేయాలి. రాష్ట్రాలు తమ అవసరాలనుబట్టి కార్యక్రమాలు రూపొందించుకుంటాయి. కేంద్రమే కార్యక్రమాలను రూపొందిస్తే, అవి రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఉండకపోవచ్చు. ఒక్కో రాష్ట్రానికి అవసరం, ప్రాధాన్యం ఒక్కోరకంగా ఉంటుంది.
-ఒకప్పుడు ఉద్యమంగా నడిచిన పంచాయతీరాజ్‌వ్యవస్థ నేడు నిర్వీర్యమైపోతున్నది. స్థానిక సంస్థలు నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. నిధులు లేక కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఉంది. కాబట్టి స్థానిక సంస్థలకు నిధులివ్వాలి.
-కాంపా నిధులు బ్యాంకుల్లో మూల్గుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అందించాలి. గ్రీన్‌కవర్ పెంచుతున్న తెలంగాణలాంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలి.
-రాష్ట్రంలోని బ్యాంకులకు గతంలో నెలకు రూ.3 వేల కోట్ల చొప్పున కరెన్సీ వచ్చేది. పెద్ద నోట్లరద్దు తర్వాత వెయ్యి కోట్లు కూడా రావడం లేదు. కరెన్సీ కొరతవల్ల బ్యాంకుల్లో డబ్బులున్నా ప్రజలు వాటిని వినియోగించుకోలేని దుస్థితి ఉంది. కరెన్సీ ఎక్కువ విడుదలయ్యేలా ఆర్‌బీఐని ఒప్పించాలి.

సోర్స్ : నమస్తే తెలంగాణ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat