రేవ్ పార్టీ… ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు. విదేశాలకే పరిమితమైన ఈ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఈ రేవ్‌పార్టీల విష సంస్కృతి ఏపీలోని కర్నూలుకు పాకింది. నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ టీమ్స్ … లాడ్జీపై దాడులు చేశారు. అక్కడ గానా భజానాతో అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సడన్‌గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వాళ్లను వెంటపడి మరీ పట్టుకున్నారు. నగరంలోని కొంత మంది ఎరువుల వ్యాపారులు లాడ్జీలో రేవ్‌పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఓ పోలీస్ సీఐ సైతం పార్టీకి వచ్చి ఎంచక్కా.. చుక్కా, ముక్కలతో ఎంజాయ్ చేశారు. వారితో పాటు కొంత మంది వ్యవసాయ అధికారులు సైతం ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీపై పోలీసులకు కొందరు స్థానికులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జీ యజమానితోపాటు, కొంతమంది ఫెర్టిలైజర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పార్టీలో పాలుపంచుకున్న సీఐ, వ్యవసాయ అధికారులను మాత్రం అదుపులోకి తీసుకోక పోవడం ఆశ్చర్యకరం.
