ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. కడప – రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఎర్రచందనం కూలీలు అయి ఉంటారని పోలీసులు అనుమానంతో చెబుతున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
