జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తే…కొందరు ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మరికొందరు 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారని వారి గెలుపునకు తమ నాయకుడే కారణమని చెప్తుంటారు. అసలు తమ నాయకుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పిలుపును, డెడ్‌లైన్లను…తను గెలిపించినట్లుగా చెప్పుకొనే పార్టీలే పట్టించుకోవడం లేదంటున్నారు.
2018 నుంచి ఫుల్‌టైం రాజకీయవేత్తగా ఉంటానని ప్రకటించిన పవన్ మిగతా పార్టీల కంటే చాలా ఆలస్ంయగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై గళం వినిపించడం మొదలుపెట్టారు. ఏపీకి అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్తుండగా, అరకొరగా ఇచ్చారని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో నిజాలు తేల్చేందుకు జేఎఫ్‌సీ ఏర్పాటు చేశానని పవన్ వెల్లడించారు. విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది ? ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది ? నిధులు ఎన్ని వచ్చాయి ? ఎంత ఖర్చయ్యాయి ? ఇతరత్రా అంశాలపై కమిటీ వేసినట్లు తెలిపారు. లోక్‌సత్తా అధినేత జేపీ, రాజకీయవేత్త ఉండవల్లితో పాటు ఇతర మేధావులు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి…జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను టీడీపీ తనకు పంపించాలని కోరుకుంటున్నట్లు అలాగే రాష్ట్రానికి పంపించిన నిధుల వివరాలను బీజేపీ నేతలను కోరుతున్నట్లు పవన్ తెలిపారు.
అయితే పవన్‌కు ఈ విషయంలో నిరాశే ఎదురైందని అంటున్నారు. పవన్ ప్రకటనలను, డెడ్‌లైన్లను పలువురు సీరియస్‌గా పట్టించుకున్న దాఖలాలు లేవనే అంటున్నారు. జేఎఫ్‌సీ మొదటి సమావేశం వరకు కూడా ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ పవన్ కోరిన వివరాలు అందించలేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే…`ప్రత్యేకంగా వివరాలు ఇవ్వడం ఎందుకు? వెబ్‌సైట్లో ఉన్నాయి చూసుకోవచ్చు కదా?` అంటూ పవన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. ఇక బీజేపీ అయితే ఆ మాత్రం కూడా చెప్పలేదు.
మరోవైపు పార్లమెంట్‌లో ఏపీకి మద్దతుగా తెలంగాణ ఎంపీ కవిత మాట్లాడటం పట్ల హర్షం వ్యక్తం చేసిన పవన్ `చెల్లెలు కవితకు ధన్యవాదాలు` అని ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్‌కు కవిత ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. కనీసం ట్వీట్‌లో కూడా రిప్లై ఇవ్వలేదు. ఈ పరిణామాలు గమనిస్తే…పవన్ ఒకనాటి మిత్రపక్షాలు కానీ…ఇటీవల ఆయన కలుస్తున్న పార్టీలు కానీ..పవన్ ఇచ్చిన పిలుపులను…ఆయన పెట్టిన డెడ్‌లైన్‌లను సీరియస్‌గా తీసుకోవలేదని చర్చ జరుగుతోంది.