రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నం ఫలించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరకు ఉక్కును విక్రయించేలా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. టన్ను ఉక్కును మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయించేందుకు స్టీల్ కంపెనీల యజమానులు అంగీకరించారు.
బేగంపేట మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ స్టీల్ కంపెనీల యజమానులతో సమావేశమయ్యారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీలును నిర్ధిష్టమైన (బేస్ రేట్) ధరకు అందించాలని స్టీల్ కంపెనీలను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు నాణ్యతతో విశాలమైన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నదని, ఇటువంటి ఉన్నత కార్యక్రమానికి.. లాభాపేక్షతో కాకుండా సానుకూల దృక్పథంతో సరసమైన ధరకు ఉక్కును విక్రయించాలని సూచించారు. గ్రామాల్లో లక్ష ఇండ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నులు, పట్టణాల్లో 60 వేల ఇండ్లకు 1.04 లక్షల మెట్రిక్ టన్నులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లకు 2.78 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరమని వివరించారు. ఈ మేరకు రెండు నెలల కాలానికి (లాక్ ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 16- ఎప్రిల్ 16 వరకు ) గానూ రూ. 43,660కే ఉక్కును అమ్మేందుకు ఉక్కు కంపెనీలు అంగీకరించాయి. ఉక్కు కంపెనీల యజమానులతో పలు దఫాలు చర్చించి నిర్దిష్టమైన ధర (బేస్ రేట్)ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించిన గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ను ఈ సందర్భంగా మంత్రులు అభినందించారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పథకం ప్రారంభించినప్పుడు మెట్రిక్ టన్ స్టీల్ ధర ట్యాక్స్ లతో కలుపుకుని రూ.32,550 ఉండగా…బహిరంగ మార్కెట్లో ప్రస్తుత స్టీల్ ధర రూ.53,100 (జీఎస్టీతో కలిపి) ఉంది. అయితే స్టీల్ కంపెనీల యజమాన్యాలతో చర్చించిన తర్వాత స్టీల్ మెట్రిక్ టన్ ధర రూ.43,660కే (జీఎస్టీతో కలిపి) విక్రయించేందుకు వారు ముందుకు వచ్చారు. దీనివల్ల గృహ నిర్మాణ శాఖపై రూ.264.60 కోట్ల భారం తగ్గింది. బహిరంగ మార్కెట్ తో పోలిస్తే ఒక్కో మెట్రిక్ టన్ కు రూ.9,440 తగ్గిందని చెప్పవచ్చు.