జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఒకనాటి ఆయన మిత్రపక్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయని అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని దీన్ని ప్రశ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నాని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే దాని పేరును జేఎఫ్‌సీగా పవన్ మార్చారు. అయితే ఈ సందర్భంగా నిజాలు నిగ్గుతేలుస్తామని పవన్ ప్రకటించారు. అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్తుండటం, అరకొరగా ఇచ్చారని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో నిజాలు తేల్చేందుకు ఈ జేఎఫ్‌సీ ఏర్పాటు అంటూ వివరించారు.
విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది ? ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది ? నిధులు ఎన్ని వచ్చాయి ? ఎంత ఖర్చయ్యాయి ? ఇతరత్రా అంశాలపై కమిటీ వేసిన పవన్ ఈ అంశాలను తేల్చేందుకు తనకు వివరాలు సమర్పించాలని డిమాండ్ పెట్టారు. లోక్‌సత్తా అధినేత జేపీ, రాజకీయ వేత్త ఉండవల్లితో పాటు ఇతర మేధావులు, నిపుణులు ఈ వివరాలలో వాస్తవికతను తేల్చుతారని వెల్లడించారు. అయితే పవన్‌కు తాజా,మాజీ మిత్రపక్షాలు షాక్ ఇచ్చాయని అంటున్నారు.
ఎందుకంటే..పవన్ పిలుపును టీడీపీ-బీజేపీ లైట్ తీసుకున్నాయి. నిర్దేశిత డెడ్‌లైన్ పెట్టినప్పటికీ…వివరాలు ఇటు కేంద్రం కాని…అటు రాష్ట్రం కానీ మరో వైపు అధికారంలో ఉన్న ప్రభుత్వం తరఫున కానీ వెలువరించలేదు. దీంతో పవన్ సత్తా ఏంటో తేలిపోయిందని అంటున్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ తప్ప మిగతా అన్ని పార్టీలకు చెందిన నేతలతో నేడు హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ మొదటి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే మొదటి సమావేశంలో పవన్ ఏం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ తీరుపై పవన్ ఘాటుగానే స్పందిస్తారా? లేక తన పని తాను చేసుకుంటూ పోతారా అనేది వేచి చూడాలంటున్నారు.