తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఢిల్లీ స్థాయిలో షాక్ తగిలిందని అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో తన మార్కు వేయాలని భావిస్తే..ఆదిలోనే బ్రేకులు పడ్డాయని చెప్తున్నారు. ఒకనాడు కోదండరాం ఆప్తుడిగా ఆయన టీం ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన్ను లైట్ తీసుకున్నారని అంటున్నారు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత,ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి సన్నిహితుడు యోగేంద్ర యాదవ్.
అమ్ ఆద్మీ కార్యనిర్వాహక సభ్యుడు, ఆ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన యోగేంద్రయాదవ్ కేజ్రీవాల్ తీరుతో విడివడి…స్వరాజ్ అభియాన్ పేరుతో సొంత వేదికను ఏర్పాటు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో కలిసి ఆయన ముందుకు సాగుతున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆయన గతంలో పలు వేదికల్లో పాలుపంచుకున్నారు. ఒకదశలో…స్వరాజ్ స్పూర్తితోనే కోదండరాం ముందుకు సాగుతారని ఆయన సన్నిహితులు ప్రకటించారు. కానీ కోదండరాంను యోగేంద్ర యాదవ్ లైట్ తీసుకున్నారని అంటున్నారు.
యోగేంద్ర యాదవ్ హైదరాబాద్ పర్యటన ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో యోగేంద్రయాదవ్ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. జనసేన కార్యాలయానికి వచ్చిన యోగేందర్ యాదవ్‌కు పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతం పలికారు. ఇటీవల అనంతపురం జిల్లాలో తాను జరిపిన పర్యటన వివరాలను యోగేందర్ యాదవ్ పవన్ కళ్యాణ్ కు తెలిపారు. కాగా, తెలంగాణ రాజకీయాలపై విస్తృతంగా చర్చించిన యోగేంద్ర యాదవ్..ఇటీవల ఏపీ కోసం గళం విప్పుతున్న పవన్‌తో భేటీ అవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే సమయంలో కోదండరాంను లైట్ తీసుకోవడం కూడా గమనార్హమని అంటున్నారు.