తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ద్వారా ఎస్సీ విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది వారికోసం సైనిక్‌స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని ఎస్సీ గురుకుల విద్యాలయాన్ని సైనిక్‌స్కూల్‌గా మార్పుచేసుకునేలా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు అనుమతి ఇచ్చింది. 2018-19 విద్యాసంవత్సరంలోనే ప్రారంభం కానున్న ఈ సైనిక్ స్కూల్ తెలంగాణలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి సైనిక్‌స్కూల్. ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు ఉత్తమమైన విద్యనందించడంతోపాటు, వారిలో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని క్రీడలు, సాంకేతిక, సాంస్కృతికరంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే గురుకుల విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రంగాల్లోనూ అవకాశాలు పొందేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ నిర్ణయించింది. ఇందుకుగాను కరీంనగర్‌జిల్లా రుక్మాపూర్ ఎస్సీ గురుకుల విద్యాలయాన్ని సైనిక్‌స్కూల్‌గా మార్పుచేసేందుకు ఎస్సీ సంక్షేమశాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కోరుకొండ స్కూల్‌ను పరిశీలించిన అధికారులు
రుక్మాపూర్ గురుకుల విద్యాలయాన్ని సైనిక్‌స్కూల్‌గా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచనమేరకు అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని కోరుకొండ సైనిక్ స్కూల్‌ను సందర్శించింది. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ అకాడమిక్ అధికారులు ఎం గీతాలక్ష్మి, ఎస్ రూపాదేవి, స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మయ్య, సీఎఎంఓ జార్జ్‌వార్కీ తదితరులు ఇటీవల కోరుకొండ స్కూల్‌ను పరిశీలించి, రుక్మాపూర్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై నివేదిక సమర్పించారు.
5వ తరగతిలో ప్రవేశాలు..
టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్ ద్వారా నిర్వహించే సైనిక్ స్కూల్‌లో ప్రవేశపరీక్ష ద్వారా అయిదోతరగతి విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో సీబీఎస్‌ఈ సిలబస్ ద్వారా విద్యాబోధన చేపట్టనున్నారు. సొసైటీ నిబంధనల ప్రకారం సైనిక్ స్కూల్‌కోసం ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 10, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 5, జూనియర్ లెక్చరర్లు 7, స్పెషల్ టీచర్లు 5, నాన్ టీచింగ్ సిబ్బంది 6, ఆఫీస్ సబార్డినేట్లు 4, అకాడమిక్ ఆఫీసర్, బ్యాండ్ ఫ్యాకల్టీ, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్, ఎన్‌సీసీ కోచ్, అథ్లెటిక్ కోచ్‌ను నియమించనున్నారు. సైనిక్‌స్కూల్‌గా మార్పుచేయనున్న రుక్మాపూర్‌లో గురుకుల విద్యాలయంలో ప్రస్తుతం రెండు ఫుట్‌బాల్‌కోర్టులు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కోకో కోర్టులతోపాటు, రన్నింగ్ చేయడానికి వీలుగా 400 మీటర్ల స్టాండర్డ్ ట్రాక్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ స్టేడియం, కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయాల్సిఉంది.
విద్యార్థుల భవిష్యత్ కోసమే సైనిక్‌స్కూల్
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ద్వారా సైనిక్‌స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. సైనిక్‌స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించడం ఆనందంగా ఉంది. ఎస్సీ గురుకుల విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్స్‌ఫోర్స్ సంబంధిత రంగాల్లో చేరేలా సైనిక్‌స్కూల్‌ను తీర్చిదిద్దుతాం.
-ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి