వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాదయాత్రలో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామని జగన్ సంచలనమైన ప్రతిపాదన చేశారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోసం అందరూ కలిసి పోరాటం చేద్దామంటూ చంద్రబాబుకు పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎంపీలందరూ ఒక్కమాట మీదుంటే కేంద్రం దిగిరాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో టీడీపీ కూడా కలసి వస్తే తక్షణమే రాజీనామాలు చేద్దామంటూ చంద్రబాబుకు జగన్ ప్రతిపాదన పంపారు. ఇక తాము అధికారంలోకి వస్తే నవ రత్నాలను అమలు చేస్తామన్నారు. 88వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు జగన్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని జగన్ అన్నారు.