ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంకల్ప పాదయాత్ర 85వ రోజున ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కోసం అనేక రూపాలలో ఉద్యమాలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మార్చి 1 నుంచి మరిన్ని పోరాటాలకు పిలుపునిచ్చారు. మార్చి 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వైసీపీ పార్టీకు చెందిన ప్రతి కార్యకర్త, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆందోళన చేస్తారు. కలెక్టరేట్‌లను ముట్టడిస్తారని..ఐదు కోట్ల ఆంధ్రుల కళను నిజం చేస్తామని వైఎస్ జగన్ అన్నారు.
