ప్రత్యేక హోదా జగన్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుతో సహా లోకేష్‌పై పంచుల వర్షం కురిపించారు. చంద్రబాబు ప్రత్యేక హోదాతోపాటు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. ఓ పక్క ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటికిప్పుడు దుబాయ్‌కు వెళ్లడం ఎంతమాత్రం సమంజసమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధిలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం వద్ద సాగిల పడిందన్నారు.
అలాగే టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల గురించి మాట్లాడుతూ.. ఓ వైపు పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుని, మరో వైపు కేంద్ర మంత్రుల పదవులు అనుభవిస్తూ తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఏపీ మంత్రి లోకేష్ గురించి మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ అమెరికాలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు.