కృష్ణా, గోదావరిలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా పై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా చర్చించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్ రావు సమీక్షించారు.
తెలంగాణలోని చారిత్రక భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయం సహా పలు గ్రామాలు, బొగ్గు గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ తదితర ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.భద్రాచలం పట్టణం దాని చుట్టుపక్కల గోదావరి పరీవాహక ప్రాంతంలో 124 కిలోమీటర్ల మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ప్రభావిత ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ని ఆదేశించవలసిందిగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉన్నతాధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు.బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం కు కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 45 టి.ఏం.సి ల నీటిని వినియోగించుకునే హక్కు దక్కుతుందని మంత్రి అన్నారు.
ప్రస్తుతం కేంద్రమే జాతీయప్రాజెక్టుగా పోలవరంను చేపట్టినందున ఆ 45 టి.ఏం.సి.ల నీటిని తెలంగాణకు కేటాయించాలని హరీష్ రావు కోరారు. ముఖ్యమైన నీటి మళ్లింపు ప్రాంతాల వద్ద టెలిమెట్రీ స్టేషన్ ల ఏర్పాటులో జరుగుతున్నా జాప్యం వల్ల పోతిరెడ్డిపాడు కింద అధిక నీటిని కృష్ణా బేసిన్ అవతలకు అక్రమంగా తరలిస్తున్నట్టు హరీష్ రావు ఆరోపించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈ.ఎన్.సి.లు మురళీధర రావు,నాగేందర్ రావు,సి.ఈ.లు సునీల్, ఖగేందర్ రావు,లింగరాజు,హరిరామ్, బంగారయ్యశంకర్,భగవంతరావు తదితరులు పాల్గొన్నారు