ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని,కేంద్రం ఇవ్వకుంటే ఏప్రిల్ 6న తమ లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తారని వై సీ పీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారట, జగన్ కి ఎంతటి తెలివి తేటలు చూడండి!’ అంటూ వ్యంగ్యంగా అన్నారు.ఎప్పుడో ఏప్రిల్ 6వ తారీఖు చేస్తారట.. జగన్ బాగా తెలివైనవాడు.. ఏప్రిల్ ఆరున రాజీనామాలు పంపితే వాటి అంగీకారానికి కనీసం రెండు నెలలు పడుతుంది.నవంబర్ లేక డిసెంబరులో ఈ జమిలి ఎన్నికలు వస్తాయి.. ఏపీ లోక్ సభకి మళ్లీ ఎన్నికలు ఎందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపదు. నవంబర్ లేక డిసెంబరు వరకు ఆగుతుంది అని అన్నారు.రెండు సంవత్సరాల క్రితం కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని ఇదే మాట జగన్ చెప్పారని గుర్తు చేశారు. జగన్ ఈ రోజు ఓ మాట చెబుతారని, కొన్ని రోజుల తరువాత మరో మాట చెబుతారని, ఆయన మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మరని అన్నారు.
