ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాలకు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఫిరాయింపుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ పదవీకాలం దగ్గరపడుతుండడం, ఎన్నికల వాతావరణం కనిపిస్తుండడంతో ప్రజలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీసేందుకు ధైర్యం చేస్తున్నారు. ఈ పరిణామం ఫిరాయింపుదారుల్లో భయాన్ని సృష్టిస్తోంది.
ఇటీవల కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, గిద్దలూరు ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై జనం తిరగడ్డారు. వైసీపీ తరపున గెలిచి టీడీపీ తరపున ఇంటింటికి టీడీపీ అంటూ రావడానికి సిగ్గుగా లేదా అని అత్తార్‌ను ఒక గ్రామంలో జనం నిలదీశారు. వారి దెబ్బకు కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి ఫిరాయింపు ఎమ్మెల్యే గ్రామం నుంచి ఫిరాయించారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై ఏకంగా కోడిగుడ్లతో దాడి చేశారు గ్రామస్తులు. నీతిమాలిన నేతలు తమ గ్రామాల్లోకి రావొద్దంటూ నినదించారు. కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి సిద్దమవగా గ్రామస్తులంతా ఏకమై తరిమేశారు. ఈ ధోరణి చూసిన తర్వాత మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఎన్నికల సమీపించే కొద్ది టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు భయపడే పరిస్థితి ఉండదని.. అప్పుడు ఈ ఫిరాయింపుదారులను జనం మరింత గట్టిగా నిలదీస్తారని అంచనా వేస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల బయటకు వచ్చిన సర్వే రిపోర్టులన్నిటిలోనూ ఫిరాయింపు బ్యాచ్‌కి డిపాజిట్లు కూడా రావని.. ఎంగిలి కూటికి ఆశపడి ఓట్లేసిన జనాన్ని, అవకాశం ఇచ్చిన పార్టీని మోసం చేసిన ఫిరాయింపుదారులకు కోడిగుడ్లు, టమోటాలు స్వాగతం పలికినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.