అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్యెల్యే అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి స్థానికంగా రంగంలోకి దిగి బొల్లపల్లి నాయకులతో చేసిన రహస్యంగా మంత్రాంగం బెడిసి కొట్టి తమపట్ల ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళే స్వయంగా తెలుసుకునేలా జరగడం విశేషం.
బొల్లుపల్లి ఓటర్లు తాము నమ్మిన పార్టీకి విధేయులుగా ఉంటూ సేవ చేస్తారనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. కాని అశోక్ రెడ్డి వ్యవహార శైలి గత కొంత కాలంగా బొల్లుపల్లి ఓటర్లకు, కార్యకర్తలకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. తమ అసంతృప్తిని సమావేశంలోనే తీవ్ర స్థాయిలో వెళ్ళగక్కినట్టు సమాచారం. ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని తెగేసి చెప్పడంతో విస్తుపోవదం ఎమెల్యే వర్గీయుల వంతైంది. సంక్షేమ పధకాలు తమకు అందకుండా, ఎటువంటి ప్రయోజనాలు తమకు అందకుండా చేస్తున్న ఎమెల్యే కు బుద్ధి చెప్పేందుకు తాము ఎదురు చూస్తున్నామని బహిర్గతంగా వ్యాఖ్యలు చేయటంతో టిడిపికి పెద్ద షాకే తగిలింది.
ఇటీవలే సంజీవరావు పేటలో జరిగిన దళిత తేజం కార్యక్రమానికి హాజరైన ఎమెల్యే అశోక్ రెడ్డికి ఇదే రీతిలో దారుణ పరాభవం ఎదురైంది. దళిత ఫీల్డ్ అసిస్టెంట్ ను అన్యాయంగా విధుల్లో నుంచి తొలగించి సస్పెండ్ చేయడానికి ఎమ్యెల్యేనే కారణం అంటూ స్థానిక దళిత మహిళలు ఆయనను ప్రసంగించకుండానే అడ్డుకున్నారు. సర్పంచ్ దళిత వర్గానికి చెందినా కారణంగానే పనులు కూడా ఆపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు . ఆయన వెనుదిరిగి వెళ్తుండగా ఎన్నికలప్పుడు మళ్ళి వస్తారుగా అని చెప్పడం సంచలనంగా మారింది. అధికార పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలను ఈ సంఘటనలు బయట పెట్టాయని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.