తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరాన్ని స్వచ్ఛత విషయంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంచుదామని అన్నారు.2017లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భారత్ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అగ్రస్థానం దక్కింది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాదికి సంబంధించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు . హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటి జనాభా ఉంది. 22 వేల మంది పారిశుధ్ధ్య కార్మికులు నగరాన్ని క్లీన్ చేస్తే సరిపోదు. కాబట్టి నగరంలోని విద్యార్థులందరూ పరిశుభ్రత కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
స్వచ్ఛ భారత్ ప్రారంభం కంటే ముందే.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.తడి, పొడి చెత్త కోసం పంపిణీ చేసిన బుట్టలను వేరే అవసరాలకు ఉపయోగించకుండా.. చెత్త కోసమే ఉపయోగించాలన్నారు. మన ఇంటిలోనే తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించారు. అప్పుడు కచ్చితంగా హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా మారుతుందన్నారు.